Mytales

విజయం Author - Praveena Monangi మూడు నిమిషాలు నిమిషాలు చదవండి

                           విజయం

మూడవ తరగతి చదువుతున్న మా అబ్బాయి రోహన్ రోజూ స్కూల్ నుండి వస్తూనే అమ్మ!అమ్మ! అంటూ స్కూల్ లో జరిగే అన్ని ముచ్చట్లను ఏక దాటిగా చెబుతూనే ఉండేవాడు.....అటువంటిది గత గొద్దిరోజులుగా ఏమయ్యిందో తెలియదుగాని దిగులుగా ఉంటున్నాడు.ఏమయ్యిందని అడిగితే ఏమీ చెప్పకుంటున్నాడు....రెండుమూడు సార్లు అడిగితే  ‘’ఆ సాత్విక్....... అంటూ ఆపేస్తున్నాడు.సరే బలవంతపెట్టడం ఎందుకులే తానే చెబుతాడు అని ఊరుకున్నాను.వాళ్ళ స్కూల్ టీచర్ ని కలిసి విషయం వివరించి సాత్విక్ గురించి అడిగాను.టీచర్ ‘’రోహన్,సాత్విక్ మంచి స్నేహితులని....స్కూల్ లో ఏక్టివ్ గానే ఉంటున్నాడు మీరేమీ కంగారు  పడకండి’’అని నన్ను పంపేసారు.చేసేదేమీ లేక ఇంటి దారి పట్టాను.కొద్ది రోజుల తరువాత రోహన్ ఒక రోజు  చాలా ఆనందముగా,హుషారుగా,ఏదో పోటీలో ‘’విజయం’’ సాదించినంత ఉత్సాహముగా అమ్మ!అమ్మ!అంటూ పరిగెత్తుకుని వచ్చి నన్ను గట్టిగా చుట్టేసుకున్నాడు. ‘’అబ్బో రోహన్ గారు ఈ రోజూ బలే హుషారుగా ఉన్నారే!ఏమిటి సంగతి?’’అంటూ వాడిని ఒడిలోకి తీసుకుని అడిగాను. ‘’సాత్విక్ ఇంక మరి ఏడవడమ్మా!వాళ్ళ అమ్మ న్నాన్నలతోనే  ఉంటాడు.....ఆంటీ చెప్పింది.....ఇంక వాళ్ళందరూ కలిసే ఉంటారంట.....నిజమమ్మా’’......అంటూ తెగ ఆనందపడిపోతున్నాడు.నాకేమీ అర్దం కాకపోయిన రోహన్ సంతోషాన్ని నీరుగార్చడం ఎందుకని కాసేపు ఊరుకున్నాను. ‘’ఆంటీ ఎవరమ్మా!సాత్విక్ ఏడవకపోవడం ఏంటి రోహన్ ఎవరి గురించి చెబుతున్నావ్?’’ ‘’అదీ మా ఫ్రెండ్ సాత్విక్’’.......అని రోహన్ ఏదో చెప్పబోతుంటే..... ‘’మేము చెబుతాము’’.....అంటూ ఇద్దరు ఇంటి గుమ్మం వద్ద నిలబడిఉన్నారు.వాళ్ళని చూడగానే రోహన్ ఆంటీ అంటూ పరుగెత్తుకుని వెళ్ళి వాళ్ళని తన చిట్టి చేతులతో లోపలకి తీసుకువచ్చాడు. ‘’క్షమించండి ....మీ అనుమతి తీసుకోకున్నా లోపలికి వచ్చాము,మేము మీ అబ్బాయి ఫ్రెండ్ సాత్విక్ వాళ్ళ అమ్మానాన్నలము ....’’అనగానే వాళ్ళని కూర్చోమని కుర్చీలు చూపించాను.....విషయం అర్దం కాక....ఏమి మాట్లాడాలో అర్దం కాక సంశయిస్తున్న నాతో...... ‘’ఈ రోజూ మీ అబ్బాయి మాకు కను విప్పు కలిగించాడండి’’అంటూ సాత్విక్ తల్లి హృదయపూర్వకముగా అభినందనలు తెలుపుకుంది’’. ‘’క్షమించండి మీరు ఏమి మాట్లాడుతున్నారో  నాకు అర్దం కావడం లేదు....మా అబ్బాయి.......’’ అంటూ నేను ఏదో అడగబోతుంటే....... ‘’మీ అబ్బాయి రోహన్ మా అబ్బాయి సాత్విక్ ఒకే స్కూల్లో ఒకే క్లాస్ చదువుతున్నారు.పరిస్థితుల కారణం వలన,మేము ఉండే ఊరి కారణముగా,మా అబ్బాయికి మంచి విద్య చెప్పించాలనే ఉద్దేశ్యం వలన సాత్విక్ ని హాస్టల్ లో ఉంచాము.పదిహేనురోజులకి,కుదిరితే వారము రోజులకి ఒకసారి వచ్చి సాత్విక్ ని కలిసి వెళ్లిపోతున్నాము.మేము వచ్చిన కొన్ని సార్లు మీ అబ్బాయిని కలిసాము....సాత్విక్ తో పాటు ఆడుకోవడం గమనించాము. వారము రోజుల క్రితము సాత్విక్ కి జ్వరము అని కబురు రావడము తో నేను పరిగెత్తుకుని హాస్టల్ కి చేరుకున్నాను....కానీ సాత్విక్ స్కూల్ కి వెళ్ళాడని చెప్పడం తో అక్కడికి వెల్లాను.అక్కడ వీళ్ళిద్దరూ కనిపించారు.లంచ్ టైమ్ అవ్వడం తో ఇద్దరు ప్లేగ్రౌండ్ లో చెట్టుకింద కూర్చుని ఉన్నారు.నేను సాత్విక్ పక్కన కూర్చుని నుదిటి  మీద చెయ్యిపెట్టి ఎలా ఉంది నాన్న ఇప్పుడు? అని అడుగుతుంటే వాడు నన్ను చుట్టేసుకున్నాడు. ‘’ఆంటీ సాత్విక్ ని మీదగ్గరే ఉంచుకోవచ్చుకదా!వాడు రోజూ ఏడుస్తున్నాడు.అమ్మ! అమ్మ! అని ఏడుస్తున్నాడు.నాకు జ్వరం వస్తే మా అమ్మ దగ్గరే బజ్జుంటాను.పాపం వీడు చూడండి మీరు లేరు కదా!పాపం......హాస్టల్ లో దోమలు కుడుతున్నాయంట....మా ఇంట్లో కుట్టవు ఆంటీ! అమ్మ ఆలవుట్ వేస్తుంది కదా!మరేమో వీడికి కూరలు నచ్చడం లేదంట....అందుకని అన్నం తినడం మానేస్తున్నాడు....నా అన్నం ఇద్దరం షేర్ చేసుకుంటున్నాము....నాకు అమ్మ బంగాళాదుంప వేపుడు,పప్పు ఆవకాయ అన్నీ పెడుతుందిగా ....వీడికి అవే ఇష్టం మరి.....హాస్టల్ లో సాత్విక్ ని మొన్న బన్నూ కొట్టాడంట! చూడండి వీపీ మీద దెబ్బ....పాపం సాత్విక్ .....ప్లీజ్ ఆంటీ  ప్లీజ్....సాత్విక్ ని మీదగ్గరే ఉంచుకోండి మా మమ్మీ లాగా! హాస్టల్ లో వద్దు ఆంటీ....మా మమ్మీ లాగా రోజూ బాయ్ చెప్పండి,స్కూల్ నుండి రాగానే ఆడుకోండి సాత్విక్ తో ....అప్పుడు ఏ బూచి ,జ్వరం రాదు వాడి దగ్గరికి.....’’అంటూ.....తన ముద్దు ముద్దు మాటలతో మమ్మల్ని ఆలోచింప చేశాడు మీ రోహన్.....మీ అబ్బాయి మాటలు విన్న నేను ఏమి తప్పు చేశానో తెలుసుకున్నాను.పిల్లలకి భాల్యం లో తల్లితండ్రుల దగ్గర నుండి లభించే అనురాగ ఆప్యాయతలనీ వాళ్ళకి అందకుండా హాస్టల్ అనే మహమ్మారికి బలి ఇస్తున్నాము.చిన్న వాడయిన తన వయసుకి తగ్గట్టు,తన బాష లో నాకు బాగా బుద్ది చెప్పాడు.నేను వెంటనే మా ఊరికి వెళ్ళి మావారికి నచ్చజెప్పి ఈ వయసులో పిల్లలకు మన నుండి ప్రేమను దూరం చేయకూడదు,అది వాళ్ళ హక్కు అని వివరించాను.అందుకు సాత్విక్ వాళ్ళ నాన్న కూడా అంగీకరించి తన తప్పు తెలుసుకున్నారు.బాబు చదువు మాకు ముఖ్యమే,అలాగే వాడి భాల్యము మాతోనే......అని నిర్ణయించుకుని,ఇప్పుడు మేమిద్దరము ఇదే ఊరికి వచ్చేసాము.మా ఊరిలో చేసుకునే పని ఇక్కడే చేసుకుంటాము......’’అని సాత్విక్ వాళ్ళ అమ్మ ఆనందబాష్పాలతో.......జరిగింది చెప్పుకుంటూ వచ్చింది....తరువాత రోహన్ ని ఆమె ముద్దులాడి,మీ అడ్రెస్స్ స్కూల్ లో కనుక్కున్నామని చెప్పి నా దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు.ఇంక రోహన్ కళ్ళల్లో ఏదో సాదించిన విజయోత్సవం ఒక మెరుపు మెరిసింది.....నేను కూడా రోహన్ ని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టకుండా ఉండలేకపోయాను.

Praveena Monangi

ఈ కథ గురించి

పోస్ట్ చేసిన తేదీ: 11th March 2018

జనర్ : moral

రకం : Story

ఇష్టమైన: 0

మొత్తం వీక్షణలు: 101

ఒక సమీక్షను వ్రాయండి
Be the first to review