Mytales

అనూదయం Author - Mohammad Gouse 5 నిమిషాలు చదవండి

ఒక విశాలమైన రోడ్డు. హోలీ పండుగ జరిగి ఇంకా రెండు రోజులు కూడా పూర్తవకపోవడంతో రోడ్డు మీద రంగులలానే ఉన్నాయి. సాయంకాలం కాబట్టి స్కూల్ కెళ్ళిన పిల్లలు ఇళ్ళకెళ్తున్నారు. రోడ్డు పక్కన ఒక చెట్టు ఎన్ని పక్షులకైనా సరే ఆశ్రయాన్నివడానికి నేను సిధ్ధం అన్నట్టు నిలబడి ఉంది. ఆ చెట్టు పైన రెండు జంట పావురాలు కూర్చుని మనుషులకర్థం కాని పావురాల భాషలో ఏదో మాటాడుకుంటున్నాయి.

          చెట్టు కింద ఉన్న బెంచి మీద ఒకమ్మాయి కూర్చుని ఉంది. చాలాసేపటి నుండి ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టుంది. నారింజ రంగు చుడీదార్, తెలుపు రంగు చున్నీ, రింగుల జుత్తుతో చూడటానికి చాలా క్యూట్ గా ఉంది. అలా ఆ అమ్మాయి ఎదురుచూస్తూ ఉండగా కొద్దిసేపటికి అక్కడికొచ్చాడు ఉదయ్.

"ఏంటి ఉదయ్? ఎంత సేపు వెయిట్ చేయాలి నీకోసం " అంటూండగా అను పక్కన కూర్చుని తన రెండు చేతుల్తో అను రెండు చేతుల్ని పట్టుకున్నాడు.

"రోడ్డు పక్కనే కూర్చుని ఉన్నాం, ఏంటిది? వదులూ" అంటూ చేతులు వెనక్కి తీసుకోడానికి ప్రయత్నించింది అను.

'తన ప్రేమలానే పంతమూ గట్టిదే ' వదల్లేదు ఉదయ్.

"అందరూ మనల్నే చూస్తూ వెళ్తున్నారు" అంటూ ప్రయత్నిస్తోంది అను.

"చూస్తే చూడనీ, నా లవర్ చేతులే నేను పట్టుకుంది, వాళ్ళ లవర్ ల చేతులు కాదు" అంటూ నవ్వాడు.

ఇంత చిలిపిగా అల్లరి చేస్తూ ఉండే ఉదయ్ కి ఇప్పుడు తాను చెప్పడానికి వచ్చిన విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు.

రెండు నిమిషాల తర్వాత చేతుల్ని వదిలాడు ఉదయ్.

"ఏంటో ఉదయ్ , నీ పనులు అస్సలు అర్థం కావు. నేనొకటి చెప్దామని వస్తే నువ్వొకటి చేసి అన్నీ మర్చిపోయేలా చేస్తావ్" అంటూండగా"నువ్వేం చెప్పడానికి వచ్చావో తెలీదు కానీ ఇందాక నేను మాత్రం లేట్ గా వచ్చిన విషయం నువ్ మర్చిపోవాలని అలా చేసాను" అని నవ్వాడు.

 

అప్పుడు అను "కదా..! అస్సలు నేను గమనించనేలేదు, ఇలానే ఏదో ఒక మాయ చేసి నన్ను బోల్తా కొట్టిస్తూ ఉంటావ్" అంటూ నవ్వింది.

నారింజ రంగు చుడీదార్ లో ఉన్న తను నవ్వుతుంటే అందం తనలో మాత్రమే నిండి ఉందేమో అనిపిస్తోంది.

అలానే నవ్వుతూ నవ్వుతూ మెల్లగా ఆ నవ్వు ఏడుపులా మారింది. అను ఎందుకేడుస్తోందో ఉదయ్ కి అర్థం కాలేదు.

"ఏమైంది అను?" అని అడుగుతుంటే తను ఏడవటం ఇంకా పెంచిందే కానీ తగ్గించలేదు.

అనుని దగ్గరికి తీసుకుని ఓదారుస్తున్నాడు ఉదయ్. రోడ్డుపై వెళ్ళే వాళ్ళంతా వీళ్ళనే చూస్తున్నారు.

కానీ ఇద్దరూ వాళ్ళని పట్టించుకోవటం లేదు. ప్రేమికులంతే! తమలో ఏ ఒక్కరికి కష్టం కలిగినా మిగతాదేన్నీ లెక్కచేయరు. తన ప్రేమని ఆ కష్టం నుండి బయటికి తేవడానికి మాత్రమే ఆలోచిస్తారు.

"అనూ... ఏమైంది అనూ.. ఎందుకేడుస్తున్నావ్? నేనేమైనా అన్నానా? నాకు తెలీకుండా నీకు నచ్చని పని ఏదైనాచేసానా..?" అంటూ అడుగుతున్నాడు ఉదయ్.

కాదు అన్నట్టు ఏడుస్తూనే తలూపింది అను.

"నీ బుగ్గల మీద ఎప్పుడూ నవ్వే చూడాలి నేను. కన్నీళ్ళు కనపడితే తట్టుకోలేను. ఏడవకు" అంటూ కళ్ళు తుడిచాడు.

కొద్దిసేపటికి తేరుకుని బ్యాగ్ లో నుండి మొబైల్ తీసి ఒక ఫోటో చూపించింది అను.

"ఎవరితను..?"

"విజయ్ అని మా దూరపు చుట్టాలంట"

"నాకెందుకు చూపిస్తున్నావ్?" అర్థం కానట్టు అడిగాడు ఉదయ్.

"ఎక్కడో నన్ను చూసాడంట. నేను నచ్చానంట, మా ఇంటికొచ్చి మా నాన్నని అడిగారు"

విషయం అర్థమైంది ఉదయ్ కి.

"అబ్బాయి ఉద్యోగం, కుటుంబం నాన్నకి నచ్చటంతో ఆయన సరేనన్నారు" అంది.

"అయితే మీ నాన్ననే చేసుకోమనలేకపోయావా? పెళ్ళి"

"ఉదయ్.. హి ఈజ్ మై డ్యాడ్, కంట్రోల్ యువర్ వర్డ్స్" అంది అను.

ఎంత ప్రేమించిన అమ్మాయైనా సరే నాన్నని ఏమైనా అంటే అస్సలు తట్టుకోలేదు.

కొంచెం కోప్పడింది అను.

"సరే అయితే అడ్వాన్స్ డ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్" అని చెప్పి నవ్వుతున్నట్టు నటించాడు ఉదయ్.

"ఉదయ్... ఏడుపాపు... ఇంతసేపు నన్ను ఏడవొద్దని చెప్పి నువ్ ఏడుస్తావేం?" అంది ఆ నవ్వు వెనుక ఉన్న ఏడుపుని గమనిస్తూ

"మరి, ఏం చేయమంటావ్?" అనడిగాడు ఉదయ్

రెండు నిమిషాలు మౌనం రాజ్యమేలింది.

ఆ మౌనాన్ని కొనసాగిస్తూ "అను" కంటి నుండి ఒక కన్నీటి చుక్క కిందకి జారింది.

"సరే మీ నాన్నని అడుగుతాను" అన్నాడు ఉదయ్.

"నేను అడిగాను"

"ఏమన్నారు?" ఆశతో అడిగాడు ఉదయ్.

"నేనీ విషయం చెప్పగానే నాన్న నన్ను అడిగిన మొట్ట మొదటి ప్రశ్న ఆ అబ్బాయిది మన కులమేనా? అని"

మళ్ళీ మౌనం.

కొన్ని సార్లు మాటలకన్నా మౌనమే చాలా చెప్తుంది.

"మరేం చేద్దాం" ఉదయ్ ప్రశ్న.

"నా కుటుంబానికి నా అవసరం కన్నా, నీ కుటుంబానికి నీ అవసరం, తోడు రెండూ ఎక్కువ. కాబట్టి ఇదంతా మర్చిపోదాం " అంటూ కన్నీళ్ళని బలవంతంగా ఆపుతూ చెప్పింది అను.

"ఏదో చెప్పేయాలి కాబట్టి చెప్తున్నావ్ కానీ చూడు నీక్కూడా ఇష్టం లేదు ఈ మాట" అని అనుని దగ్గరికి తీసుకుంటుండగా " ఒకసారి చెప్తే అర్తం కాదా? నన్ను మర్చిపో... నేను అన్నీ నిర్ణయించుకునే ఇది చెప్పడానికొచ్చాను" అంది అను.

"అది నా వల్ల కాదు. ఐ కాంట్ టేక్ దట్ పెయిన్, నిద్ర మాత్రలు వేస్కుంటే తప్ప నిద్ర పట్టట్లేదు రోజూ" అన్నాడు ఉదయ్.

"కాంట్ టేక్ పెయిన్ అయితే ఆ పెయిన్ లోనే ఉండు, నేను మాత్రం అతన్ని పెళ్ళి చేసుకుని ఆనందంగా ఉంటాను" అంది అను.

"నువ్ చెప్దామని చెప్తున్నావో, నిజంగా చెప్తున్నావో నాకు ఇప్పటికీ అర్థం కాట్లేదు అను"

"అర్థం కాదురా, నీకెప్పటికీ కాదు. నన్ను దూరం చేసుకోమని అర్థమొచ్చే ఏ మాటా నీకర్థం కాదు.

"ఇప్పుడు చెప్తున్నా విను, ఆ అబ్బాయి మా నాన్న చూసిన అబ్బాయిని నేను చేస్కుంటాను, నేను హ్యాపీగానే ఉంటాను. నువ్వే నాకోసం బాధ పడుతూ ఉండు" అని చెప్పి వెళ్ళిపోయింది.

ఉదయ్ తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో అనుకి తెలుసు. తను వదిలేయమని చెప్పగానే వదిలేయలేడనీ తెలుసు. కనీసం ఇలా మాట్లాడితే అయినా తన మీద కోపంతో మర్చిపోతాడేమో అని అలా చెప్పి వెళ్ళిపోయింది అను.

అను ఎందుకలా చెప్పి వెళ్ళిపోయిందో అర్థం కాలేదు ఉదయ్ కి. కానీ ఒకటి మాత్రం అర్థమైంది "ఇక మీదట తన జీవితంలో అను ఉండబోదని" . తన జీవితంలో జరిగిన ప్రతిదీ అను వల్లే జరిగిందనీ, జీవితమంటే అను పరిచయమయ్యాకే అని భావిస్తాడు ఉదయ్. ఇంక అనుయే లేనప్పుడు అవన్నీ ఉండి ఏం లాభమని ఆలోచించాడు.

రోజూ వేసుకునే నిద్ర మాత్రలే కొంచెం సంఖ్య పెంచి మింగాడు. నిద్ర సమయం కూడా పెరిగింది. ఆ పెరిగిన సమయం పేరే 'శాశ్వతం '

కొద్ది రోజుల తర్వాత...

ఒక విశాలమైన రోడ్డు.

సాయంకాలం కాబట్టి స్కూల్ కెళ్ళిన పిల్లలు ఇళ్ళకెళ్తున్నారు. రోడ్డు పక్కన ఒక చెట్టు ఎన్ని పక్షులకైనా సరే ఆశ్రయాన్నివడానికి నేను సిధ్ధం అన్నట్టు నిలబడి ఉంది. ఆ చెట్టు పైన రెండు జంట పావురాలు కూర్చుని మనుషులకర్థం కాని పావురాల భాషలో ఏదో మాటాడుకుంటున్నాయి.

జంట పావురాల పక్కన కొమ్మ మీద ఇంకో పావురం విడిగా కూర్చుని ఉంది. కొత్తగా పెళ్ళైన అను, విజయ్ తో కలిసి ఆ చెట్టు కింద నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో తన కళ్ళు తేమగా మారాయి. ముఖం నిర్జీవంగామైంది. నవ్వు నకిలీదైంది. ఒక్కసారిగా ఉదయ్ తాలూకు జ్ఞాపకాలు అనుని తట్టి లేపి వాటి దారిన అవెళ్ళిపోయాయి.

అను మనసులో ఆలోచన మొదలైంది. తప్పు చేసిందో, పొరపాటు చేసిందో తనకి తెలీదు. ఏదైతేనేం, నష్టం జరిగింది ఉదయ్ కి, అతని కుటుంబానికి. దీని గురించి తీవ్రంగా ఆలోచించింది. ఓ నిర్ణయానికొచ్చింది.

కొద్ది రోజుల తర్వాత,

హోలీ పండుగ రోజు,

ఒక విశాలమైన రోడ్డు. రోడ్డు పక్కన ఒక చెట్టు ఎన్ని పక్షులకైనా సరే ఆశ్రయాన్నివడానికి నేను సిధ్ధం అన్నట్టు నిలబడి ఉంది. ఆ చెట్టు పైన రెండు జంట పావురాలు కూర్చుని మనుషులకర్థం కాని పావురాల భాషలో ఏదో మాటాడుకుంటున్నాయి.

అందరూ రంగులు చల్లుకుంటూ ఆడుకుంటున్నారు.

చెట్టు మీద ఒక పావురం జంట, దాని పక్కన కొమ్మపై మరో పావురం విడిగా కూర్చుని ఉన్నాయి.

ఆ హోలీ రంగుల మధ్యలోంచి, జనాల కేకల మధ్యలోంచి నారింజ రంగులో మునిగి తేలిన ఒక పావురం వచ్చి దిగాలుగా ఉన్న పావురం పక్కన వాలింది. ఇంతసేపు దిగాలుగా ఉన్న పావురం ముఖం ఇప్పుడు వెలుగుతోంది.

ఆ నారింజ రంగులో ఉన్న పావురం పక్కనున్న పావురానికి సారీ చెప్పి అక్కడే ఉండిపోయింది.

Mohammad Gouse

ఈ కథ గురించి

పోస్ట్ చేసిన తేదీ: 9th January 2018

జనర్ : LOVE2018

రకం : Story

ఇష్టమైన: 0

మొత్తం వీక్షణలు: 106

ఒక సమీక్షను వ్రాయండి
Be the first to review